అజ్ఞానం వల్ల మనం ఆస్తులను, సంపదలను కూడబెట్టుకొనే ప్రయత్నంలో ఉంటాం. తద్వారా కర్మబంధాలను పోగుచేసుకుంటూ ఉంటాం. అవగాహన తాలూకు మొదటి కిరణం ప్రసరించిన తరువాత... పరిత్యాగం గురించి ఆలోచించడం మొదలుపెడతాం. ‘దేన్ని త్యజించాలి?’ అనే విషయంలో మనకు స్పష్టత ఉండదు. ‘ఈ పనులు మంచివి, ఈ పనులు చెడ్డవి’ అని నిరంతరం విభజించే లక్షణం మనకు ఉన్న కారణంగా... అవాంఛిత కర్మలను వదిలెయ్యడానికి సిద్ధమవుతాం.
మరొకవైపు శ్రీకృష్ణుడు పరిత్యాగం గురించి పూర్తిగా విభిన్నమైన దృక్పథాన్ని అందిస్తూ ‘‘ఎవరినీ ద్వేషించని, దేనినీ కాంక్షించని కర్మయోగే నిత్య సన్న్యాసి అని తెలుసుకోవాలి. ఎందుకంటే రాగద్వేషాది ద్వంద్వాలను అధిగమించినవాడు సంసార బంధాల నుంచి అవలీలగా ముక్తుడవుతాడు’’ అని ‘జ్ఞేయ స్సనిత్య సన్న్యాసీ’ అనే గీతా శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. మనం మొదట విడిచిపెట్టవలసింది ద్వేషాన్ని. అది మనం నమ్మే మత, కుల, జాతిపరమైన నమ్మకాలకు విరుద్ధంగా ఉండే దేనిపట్ల ఉన్న ద్వేషమైనా కావచ్చు. ద్వేషం ఒక వ్యక్తిపట్ల, ఒక వృత్తిపట్ల లేదా మన చుట్టూ జరిగే సంఘటనల పట్ల, పరిస్థితులపట్ల కావచ్చు. కనిపించే వైరుధ్యాలలో ఏకత్వాన్ని చూడడం ప్రధానం. ఒక నిత్యసన్న్యాసి ద్వేషంతో పాటు కోరికను కూడా త్యజిస్తాడు.
ద్వేషం, కోరికలు లాంటి లక్షణాలను విడనాడాలని శ్రీకృష్ణుడు మనకు సలహా ఇస్తాడు. నిజానికి కర్మలను పరిత్యజించడం అనేది లేనే లేదు. ఎందుకంటే మనం ఒక దాన్ని విడిచే ప్రయత్నంలో... మన గుణాల ప్రభావం వల్ల మరొక కర్మను చేయడం ప్రారంభిస్తాం. బాహ్య కర్మలను విడిచే బదులు... మన లోపల పాతుకుపోయిన విభజించే తత్త్వాన్ని తప్పనిసరిగా త్యజించాలి. ‘‘జ్ఞానయోగులు పొందే పరంధామాన్నే కర్మయోగులు కూడా పొందుతారు. జ్ఞాన యోగ ఫలాన్ని, కర్మ యోగ ఫలాన్నీ ఒక్కటిగా చూసేవాడే యదార్థాన్ని గ్రహిస్తాడు. కానీ అర్జునా! కర్మ యోగాన్ని అనుష్టించకుండా మనస్సు, ఇంద్రియాలు, శరీరాల ద్వారా జరిగే కర్మలన్నిట్లో కర్తృత్వాన్ని త్యజించడం కష్టం. భగవత్ స్వరూపాన్ని మననం చేసే కర్మయోగి... పరబ్రహ్మ అయిన పరమాత్మను శీఘ్రంగా పొందగలడు’’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. మనం ఎంత ద్వేషాన్నీ, కోరికలనూ మోస్తున్నామో కొలుచుకోవడానికి కర్మలు సూచికల్లాంటివి. కాబట్టి కర్మలను పరిత్యజించడం కన్నా నిష్కామ కర్మలను చేయాలని శ్రీకృష్ణుడు ప్రోత్సహించాడు.