
భగవద్గీతను ఎందుకు చదవాలి? ఈ ఆధునిక ప్రపంచంలో దాని ఆవశ్యకత ఏమిటి? దానిని చదివితే మనకు వచ్చే లాభమేమిటి?- చాలా మందిని వేధించే ప్రశ్నలివి. ఒకటో తరగతి నుంచి పీహెచ్‌డీ దాకా విజ్ఞానం నేర్పటానికి ఒకే గ్రంధం ఉందనుకుందాం. అలాంటి గ్రంధమే భగవద్గీత. జీవ తత్వాన్ని తెలుసుకోవటానికి అవసరమైన మొత్తం జ్ఞానం దీనిలోనే ఉంది. కులమతాలతో.. దేశప్రాంతాలతో.. సంబంధం లేకుండా అందరూ అనుసరించదగిన గ్రంథం భగవద్గీత. ఎటువంటి సంకటాలు లేని ప్రశాంత జీవితాన్ని గడపటానికి అనుసరించదగిన సాంఖ్య యోగము, కర్మ యోగము, భక్తి యోగము అనే మూడు మార్గాలు దీనిలో ఉన్నాయి. ఈ మూడు మనకు ఏమి చెబుతాయో చూద్దాం.
కర్మ యోగము
కర్మ యోగ మార్గంలో ప్రతి కర్మకు కర్త ఉంటాడు. కర్మ చేయటం వల్ల కలిగే కర్తఫలము కూడా ఉంటుంది. కర్తకు కర్మ చేసే హక్కు ఉంటుంది. కానీ కర్మఫలంపై అతనికి ఎటువంటి నియంత్రణ ఉండదు. దీనినే శ్రీకృష్ణుడు- ‘‘అన్ని కర్మలు- సత్వ, తమో, రజోగుణాల వల్ల జరుగుతాయి. ఈ గుణాలు ప్రకృతి వల్ల ప్రేరేపితం అవుతాయి. అందువల్ల జాగ్రత్తగా తరచి చూస్తే మనం కర్తలు కూడా కాదని అర్ధమవుతుంది’’ అని చెబుతాడు. కర్మలు చేయటం వెనక కూడా ఒక పరమార్థముందని.. కర్మలను చేయకపోతే ఈ భౌతిక దేహం యొక్క అస్థిత్వతే ఉండదని చెబుతాడు.
సాంఖ్యయోగము
ఇంద్రియాలు.. వాటి చేతనకు సంబంధించినది సాంఖ్యయోగము. ఇంద్రియాలకు తృప్తిపడే గుణం ఉండదు. అనుక్షణం కొత్త విషయాలను కోరుకుంటూనే ఉంటాయి. వీటిని నియంత్రించకపోతే అనుక్షణం సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఉదాహరణకు పొగడ్తలకు పొంగిపోవటం.. విమర్శలకు కుంగిపోవటం జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం సుఖదుఃఖాలను ఒకే రీతిలో తీసుకోకపోవటం. వీటిని సమదృష్టితో చూడగలిగినప్పుడు సుఖదుఃఖాలకు తావే ఉండదు. అందుకే నిజమైన జ్ఞానమంటే- మట్టిని.. బంగారాన్ని సమంగా చూడటమే!
భక్తియోగం
పరమాత్మకు సంపూర్ణంగా అర్పించుకోవటమే భక్తియోగం! ఇలా అర్పించుకోవటానికి ఉన్న ఏకైక సాధనం శ్రద్ధ. మనని మనం పరమాత్మకు అర్పించుకున్నప్పుడు - జరిగే ప్రతి చర్య పరమాత్మ సంకల్పమే అవుతుంది.
ఇతరులలో మనని.. మనలో ఇతరులకు.. మొత్తానికి ఈ ప్రపంచమంతా కృష్ణ భగవానుడిని చూస్తే మార్గం
అవగతమవుతుంది.
ఎలా పొందాలి?
వీటిని పొందటానికి మనకు మూడు మార్గాలు ఉన్నాయి. అవి సత్సంగము, ప్రశ్న, సేవ. ఈ మూడింటిని ఆచరించినప్పుడు మనలో ఉన్న ఆత్మజ్ఞానం బహిర్గతమవుతుంది. మనను జ్ఞానమార్గంలో నడిపిస్తుంది.
ఉపనిషత్తుల సారం
పంచమవేదంగా ప్రసిద్ధి చెందిన భారతంలో భగవద్గీత ఒక భాగం. దీనిలో 18 అధ్యయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయం ముగింపులో - ‘‘ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే’’ అని ప్రవచిస్తారు. ‘‘ఉపనిషత్తులు ప్రతిపాదించినది, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం’’ అని దీని అర్ధం. అందుకే చాలా మంది దీనిని ఉపనిషత్తుల సారంగా భావిస్తారు.
గీతా జయంతి విశిష్టత
కురుక్షేత్ర మహా సంగ్రామంలో గీతామృతాన్ని అర్జునుడికి అందజేసిన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. అందుకే ఆ రోజును మంగళకరమైన పర్వదినంగా పరిగణిస్తారు. ఆ రోజును గీతా జయంతిగా జరుపుకుంటారు.