
‘‘కృష్ణా! ఒకసారి కర్మ సన్యాసాన్ని మెచ్చుకుంటావు. మరోసారి కర్మయోగాన్ని, అంటే కర్మలను ఆచరించాలని కూడా సలహా ఇస్తున్నావు. వీటిలో ఏది మంచి మార్గమో నాకు స్పష్టంగా చెప్పు’’ అని భగవద్గీతలోని ‘సన్న్యాసం కర్మణాం కృష్ణా’ అనే శ్లోకంలో అర్జునుడు ప్రశ్నించాడు. అంతకుముందు కూడా సాంఖ్య, కర్మ యోగాల మధ్య నిశ్చయత గురించి శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు అడిగాడు. అయితే కర్మలను సన్యసించాలని శ్రీకృష్ణుడు చెప్పలేదు. ‘‘ఎవరూ కూడా కర్మలను పరిత్యజించడం ద్వారా సిద్ధిని పొందలేరు, గుణాలను బట్టి ప్రతి ఒక్కరూ కర్మలను చేసి తీరాల్సి వస్తుంది. నిజానికి కర్మ చేయకుండా మానవ శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు’’ అని ఆయా సందర్భాల్లో తెలిపాడు. ‘‘సాంఖ్య యోగంలో కర్మ సన్న్యాసం ఒక భాగం’’ అనే విషయాన్ని అర్జునుడికి ఇచ్చిన సమాధానంలో ఆయన స్పష్టం చేశాడు.
మౌలికంగా కర్మకు రెండు భాగాలు ఉంటాయి. ఒకటి కర్త, రెండోది కర్మఫలం. అర్జునుడి దృష్టిలో కర్మసన్న్యాసం అంటే... కర్తృత్వభావనను విడనాడడం ద్వారా గుణాలే నిజమైన కర్తలు అని గుర్తించడం. కర్మ యోగం అంటే కర్మఫలాలను ఆశించకుండా కర్మను ఆచరించడాన్ని సూచిస్తుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే ‘కర్తృత్వాన్ని విడిచిపెట్టాలా? లేదా కర్మఫలాలను విడిచిపెట్టాలా?’ అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. కర్మసన్న్యాసం, క్రమయోగం ద్వారా ముక్తి లభిస్తుందనేది శ్రీకృష్ణుడి జవాబు. అయితే వీటిలో కర్మయోగమే కర్మ సన్న్యాసం కన్నా ఉత్తమమైనది అని భగవద్గీతలోని ‘సన్న్యాసః కర్మయోగశ్చ’ అనే శ్లోకంలో శ్రీకృష్ణుడు బదులిచ్చాడు. ఈ సమాధానం... కురుక్షేత్ర యుద్ధంలో తన కుటుంబం, బంధువులు, గురువులు మరణించడానికి సంబంధించిన కర్మ ఫలాలను గురించి విచారిస్తున్న అర్జునుడి కోసం ప్రత్యేకంగా చెప్పినదని గమనించాలి. అర్జునుడి లాంటి ఊగిసలాట మనస్తత్వం ఉన్నవారందరూ దీన్ని తమకు అన్వయించుకోవచ్చు.
కేవలం చిన్న పిల్లలు తప్ప జ్ఞానులు సాంఖ్య, క్రమ యోగాలను గురించి భిన్నంగా మాట్లాడరని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈ రెండిటిలో ఏ ఒక్కదాన్నయినా చక్కగా అనుష్టించిన వ్యక్తి రెండిటి తాలూకు ఫలాన్నీ పొందుతారన్నాడు. ఈ రెండు మార్గాలూ వేరు కావచ్చు. కానీ గమ్యం ఒక్కటే.